
Addanki Dayakar: జనగామ జిల్లా పాలకుర్తిలోని బృందావన్ గార్డెన్స్‌లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ సభ తీరును తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా ఆ సభలో కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీష్ రావులకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారని ఎద్దేవా చేశారు. “ఇగ నీవు అధికారంలోకి రావడం లేదు, సచ్చేది లేదు” అని వ్యాఖ్యానించిన దయాకర్, కేసీఆర్‌కు రేవంత్ రెడ్డిని తట్టుకోవడం అంత ఈజీ కాదని స్పష్టం చేశారు.
Read Also: Suhas : ఊరమాస్ లుక్ లో సుహాస్.. పోస్టర్ తోనే హైప్..
అలాగే.. నువ్వు ఉద్యమ నాయకుడి అని చెప్పుకుంటావు. 9 సంవత్సరాలుగా సీఎంగా ఉన్నావు. ఒక్క సభ కోసం వందల కోట్లు ఖర్చు పెట్టావు. కానీ, రేవంత్ రెడ్డి ఒక్కరే నిన్ను రాజకీయంగా పూర్తిగా కుదిపేశాడు. ఆ దెబ్బకి నీవు ఇప్పటివరకు కోలుకోలేదని వ్యాఖ్యానించారు. అదేవిధంగా, కేటీఆర్ ను బీఆర్‌ఎస్ పార్టీ జనతా గ్యారేజ్ అన్నావు.. కానీ, ఆ గ్యారేజ్‌లో తానే తన కొడుకును సంపేస్తున్నాడు అని విమర్శించారు. బీజేపీ పార్టీపై కూడా అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ ఒక బిల్లా రంగ పార్టీ. అందులో కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి నేతలు బిల్లా రంగ నాయకులుగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు కులగణనకు వ్యతిరేకంగా మాట్లాడిన బీజేపీ నాయకులు, ఇప్పుడు మోడీ ప్రభుత్వం కులగణన చేస్తామంటే సంతోషంగా స్పందిస్తున్నారని తెలిపారు.
Read Also: IPL 2025 : పాపం ఆ.. ముగ్గురు, కలిసిరాని వీకెండ్..!
అంతేకాకుండా, కాంగ్రెస్ పార్టీ లక్ష్యం రాహుల్ గాంధీని ప్రధాని చేయడమేనని దయాకర్ పేర్కొన్నారు. నాకు పార్టీ నుండి అవకాశం రాకపోయినా ఎప్పుడూ బాధపడలేదని, పార్టీ ఎప్పుడైనా నన్ను గుర్తిస్తుందని నమ్మకం ఉందని ఆయన అన్నారు. పార్టీ నన్ను గుర్తించి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ వాడుకునే వదిలేసే పార్టీ కాదు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఇచ్చే పార్టీ అదే కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.