
శ్రీశైలం మల్లన్న ఆలయం హుండీలో చోరీ.. ఇద్దరు మైనర్లు సహా నలుగురి అరెస్ట్..!
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో చోరీ కలకలం రేపుతోంది.. ఈ నెల 1వ తేదీన దర్శనం కోసం ఆలయానికి వచ్చిన స్థానికంగా నివసించే ఇద్దరు మైనర్ బాలురు.. ఆలయంలోని హుండీలో చోరీ పాల్పడ్డారు.. మల్లికార్జునస్వామి ఆలయం ప్రారంభంలో గల క్లాత్ హుండీని బ్లేడ్ తో కోసి డబ్బు తీస్తుండగా సీసీ టీవీలో ఆ దృశ్యాలు నమోదు కావడం.. మరోవైపు.. సీసీ టీవీని పర్యవేక్షిస్తున్న అధికారులు.. వెంటనే అప్రమత్తం అయ్యి ఆ బాలురను పట్టుకున్నారట.. ఇద్దరు మైనర్ల దగ్గర 10,150 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారట.. ఇక, శ్రీశైలం దేవస్థానం ఈవో ఆదేశాలతో కేసు నమోదు చేసి గోప్యంగా విచారణ జరుపుతున్నారట శ్రీశైలం పోలీసులు.. అయితే, గత పది రోజులుగా ఇద్దరు మైనర్లు దర్శనం పేరుతో క్యూలైన్లలో ఆలయంలోకి రావడంతో.. ఇలా దొంగతనానికి పాల్పడుతున్నారు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అధికారులు.. మరోవైపు.. చోరీ విషయమై విధుల్లో అలసత్వం వహించిన మల్లన్న ఆలయ సీనియర్ అసిస్టెంట్ ని సస్పెండ్ చేసే యోచనలో ఆలయ ఈవో శ్రీనివాసరావు ఉన్నట్టుగా తెలుస్తోంది.. హుండీలో చోరీకి పాల్పడిన ఇద్దరు మైనర్లు.. మరో ఇద్దరు మేజర్లుపై కూడా కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టుగా తెలుస్తోంది..
గుడ్‌న్యూస్ చెప్పిన సర్కార్.. వారి ఖాతాల్లో జమకానున్న రూ.20 వేలు..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది.. సొంతంగా భూమి ఉన్న రైతులే కాదు.. ఇతరుల పొలాలను కౌలు తీసుకుని వ్యవసాయం చేసే కౌలు రైతులకూ సాయం చేయాలని నిర్ణయం తీసుకుంది.. ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద ఒక్కో రైతు కుటుంబానికి రూ.20 వేల చొప్పున అందించాలనే నిర్ణయానికి వచ్చింది.. ఆ రూ.20 వేలను మూడు విడతల్లో రైతులను అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.. పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలతో కలిపి ఈ మొత్తాన్ని.. ఆయా రైతుల ఖాతాల్లో జమ చేయనుంది సర్కార్… ఈ పథకం కింద అటవీ భూములపై హక్కు కలిగిన (ఆర్‌ఓఎఫ్‌ఆర్) వారిని అర్హులుగా గుర్తించనుంది ఏపీ ప్రభుత్వం.. వ్యవసాయ, ఉద్యాన, పట్టు సహాయకులతోపాటు తహసీల్దారు, మండల వ్యవసాయాధికారులు తమ పరిధిలోని సంబంధిత రైతుల వివరాలను పరిశీలించి, ధ్రువీకరించిన అర్హుల జాబితాలను.. ఈ నెల 20వ తేదీ వరకు అన్నదాత సుఖీభవ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.. అయితే, భర్త, భార్య, పిల్లలతో కూడిన కుటుంబం యూనిట్‌గా ఈ పథకం అమలు చేసేందుకు సిద్ధమైంది సర్కార్.. పిల్లలకు వివాహమైతే వారిని ప్రత్యేక యూనిట్‌గా పరిగణించనున్నారు.. వ్యవసాయ, ఉద్యాన, పట్టుకు సంబంధించిన పంటల సాగుదారులకూ ఈ పథకం వర్తింపజేయబోతున్నారు.. అయితే, ఆర్థికంగా ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి మాత్రం ఈ పథకం వర్తించబోదని ప్రభుత్వం స్పష్టం చేసింది.. మరోవైపు, గతంలో రాజ్యాంగబద్ధ పదవులు నిర్వహించినవారు.. ఇప్పుడు నిర్వహించే వారు కూడా అర్హులు కాదు. వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, ఛార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్టులు, నమోదైన ఇతర వృత్తి నిపుణులు కూడా అర్హులు కాదు. గత సంవత్సరంలో పన్ను చెల్లించిన వారూ పథక ప్రయోజనాలు అందుకోలేరని ప్రభుత్వం స్పష్టం చేసింది..
అకాల వర్షాలతో తీవ్ర నష్టం.. మరో రెండు రోజులు భారీ వర్షాలు..!
అకాల వర్షాలు ఏపీలోని పలు ప్రాంతాల్లో చేతికి వచ్చిన పంటను ధ్వంసం చేశాయి.. ఈదురుగాలులతో మొదలైన వర్షం.. గంటన్నరపాటు బీభత్సం సృష్టించింది.. నిన్న కురిసిన అకాల వర్షం.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పంటలకు పట్టిన పూట పగిలినట్టైంది. చేతికి వచ్చే పరిస్థితిలో ఉన్న పంటలు ఒక్కసారిగా వానకు గురై రైతుల కలలను కరిగింపజేశాయి. మొక్కజొన్న, మామిడి, వరి పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. పంటలను ఎండబెట్టి మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధంగా ఉన్న రైతుల ఆశలపై వర్షం నీళ్లు చల్లింది. కల్లంలో కాట వేసిన ధాన్యాన్ని అధికారులు ఇప్పటివరకు తీసుకోకపోవడంతో, ఆ ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ఇప్పటికే నష్టపోయిన రైతులకు ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని మరోచోటికి తరలించే ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు, కూలీల వ్యయాలు కూడా భారంగా మారాయి. ఇప్పటి వరకూ ఒక్క అధికారి కూడా వచ్చి మా పరిస్థితి చూడలేదు.. మా దయనీయం ఆయన పరిస్థితిని చూసి ప్రభుత్వం మమల్ని ఆదుకోవాలి అని రైతులు వేడుకుంటున్నారు.. ఇక, తిరుపతి జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఈ అకాల వర్షం విధ్వంసం సృష్టించిందిన.. ఈదురుగాలుల ధాటికి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.. చిత్తూరు నగరంలో భారీ వర్షం కురిసింది. బాపట్ల జిల్లా నిజాంపట్నం, చీరాల, బాపట్ల, రేపల్లె, చినగంజాంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వందల స్తంభాలు నేలకూలాయి.. ఈ విధ్వంసాన్ని మరువక ముందే.. మరో రెండు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.. పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా తీరం మీదుగా ఉత్తర కోస్తా వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా.. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో ఈ రోజు కొన్ని చోట్ల.. రేపు పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, ఏలూరు, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది వాతావరణశాఖ..
అకాల వర్షాలపై వైఎస్ జగన్ టెలీకాన్ఫరెన్స్.. వైసీపీ నేతలకు కీలక ఆదేశాలు
రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.. చేతికి వచ్చిన ఎన్నో పంటలు దెబ్బతినడంతో.. రైతులు గగ్గోలు పెడుతున్నారు.. అయితే, రీజినల్ కో-ఆర్డినేటర్లు, పార్టీ ముఖ్య నేతలతో భారీ వర్షాలపై మాజీ సీఎం వైఎస్ జగన్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.. ఈ సందర్భంగా పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. అకాల వర్షాలు, ఈదురు గాలుల కారణంగా రాష్ట్రంలో పలుచోట్ల ధాన్యం తడిసిపోవడంతో పాటు అనేక ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించాలని స్పష్టం చేశారు.. ఇక, రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వైసీపీ నేతలకు సూచించారు వైఎస్ జగన్.. కష్టకాలంలో ఉన్న రైతులకు అండగా నిలవాలి. వర్షాలు కురుస్తాయన్న సమాచారం ముందస్తుగానే ఉన్నప్పటికీ కళ్లాల్లో, పొలాల్లో రైతుల వద్దనున్న ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపించిందని విమర్శించారు.. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం నిస్తేజంలో ఉంది . ఖరీఫ్‌లో ప్రతికూల వాతావరణం, కనీస మద్దతు ధరలు లభించక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రబీ సీజన్‌లో కూడా కష్టాలు పడుతున్నారని తెలిపారు.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు సహా పలు చోట్ల ప్రభుత్వం ధాన్యాన్ని సరిగ్గా సేకరించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్..
బిగ్ బాస్, అందాల పోటీలతో స్త్రీ జాతికి కళంకం.. బ్యాన్ చేయాలి..!
బిగ్ బాస్, అందాల పోటీలతో స్త్రీ జాతికి కళంకం తెస్తాయి.. బిగ్‌బాస్‌ను బ్యాన్ చేయాలి.. అందాల పోటీలను రద్దు చేయాలన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బిగ్ బాస్ కు మొదటి నుంచి మేము వ్యతిరేకం.. సమాజానికి ఉపయోగపడని షో బిగ్ బాస్ అన్నారు.. మంచి వయసులో ఉన్న యువతి యువకులను తీసుకెళ్లి బిగ్ బాస్ లో పడేస్తే.. ప్రకృతి రీ యాక్షన్స్ కు లోనవుతారన్న ఆయన.. అదే సమయంలో తప్పు చేస్తారని తెలిపారు.. అయితే, బిగ్ బాస్ పేరుతో జరుగుతోన్న చెడు సంస్కృతికి మేం వ్యతిరేకం అని స్పష్టం చేశారు.. బిగ్ బాస్ పై పోలీసులు స్టేషన్ కు వెళ్తే కేసు నమోదు చేయలేదు.. హై కోర్టులో పిల్ వేస్తే మా పిల్ ను స్వీకరించి నాగార్జున, ఎండీకి నోటీసులు జారీ చేశారని గుర్తుచేశారు సీపీఐ నారాయణ.. అసాంఘిక కార్యకలాపాలు జరిగే కార్యక్రమంగా బిగ్ బాస్ ను పరిగణనలోకి తీసుకొని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు.. హైదరాబాద్ లో అందాల పోటీ అంటే ఆడవాళ్లను అంగడి సరుకుగా మార్చినట్లే అని ఆవేదన వ్యక్తం చేశారు.. బిగ్ బాస్, అందాల పోటీలు రెండూ ఒక్కటే చర్యలేజజ అందాల పోటీ వల్ల టూరిజం ఎందుకు పెరుగుతుంది..? డబ్బు నష్టం తప్పా..? అని ప్రశ్నించారు. పవిత్రమైన స్త్రీ జాతికి కళంకం తెచ్చేది.. బిగ్ బాస్, అందాల పోటీలు అని దుయ్యబట్టారు.. చీప్ గా కాకుండా కాస్ట్లీగా వ్యభిచారం చేయాలనే సందేశాన్ని ఇలాంటి షోలు ఇస్తున్నాయన్నారు.. మన దేశంలో ఉన్న కుటుంబ సంప్రదాయం ఎంతో గొప్పది.. ఇలాంటి షోలకు తావులేదన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ..
నేడు మరో మూడు దేశాల మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ రాక
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాలకు చెందిన కంటెస్టెంట్స్ హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఇవాళ పోర్చుగల్, ఘనా, ఐర్లాండ్ దేశాలకు చెందిన ప్రతినిధులు శంషాబాద్ రానున్నారు. వీరికి పూర్తి సంప్రదాయ లాంఛనాలతో స్వాగతం పలికేందుకు పర్యాటక శాఖ ఏర్పాట్లు చేసింది. స్వాగత సత్కారాలతో పాటు, భద్రత, వసతికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. పోర్చుగల్ కు చెందిన మారియా అమెలియా ఆంటోనియో, ఘనా నుంచి జుట్టా అమా పోకుహా అడ్డో, ఐర్లాండ్ కు చెందిన జాస్మిన్ జెర్హార్డ్ లు హైదరాబాద్ చేరుకుంటారు. ఇప్పటికే,మిస్ సౌత్ ఆఫ్రికా జోయలైజ్ జన్సెన్ వాన్ రెన్స్ బర్గ్ , మిస్ బ్రెజిల్ జెస్సికా స్కేన్ద్రియుజ్య్ పెడ్రోసో ( Ms. Jessica Scandiuzzi Pedroso (Brazil), మిస్ వరల్డ్ సీఈవో, చైర్ పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లి, మిస్ కెనడా మిస్ ఎమ్మా డయన్నా క్యాథరీన్ మొర్రిసన్ లు ఇప్పటికే చేరుకున్నారు. అత్యధిక కంటెస్టెంట్లు 7 వ తేదీ నుంచి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ఈనెల 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగే ప్రారంభ కార్యక్రమంపై మిస్ వరల్డ్ చైర్ పర్సన్ జూలియా మోర్లీ సన్నాహక, సమన్వయ కార్యక్రమాలను ప్రభుత్వ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.. మిస్ వరల్డ్ పోటీల నేపధ్యంలో హైదరాబాద్ ముస్తాబవుతుంది. కంటెస్టెంట్స్, ప్రతినిధులకు భారీ బందోబస్తు మధ్య భద్రతను ఏర్పాటు చేశారు. ఈ నెల 10 న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగబోయే కార్యక్రమంతో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కానున్నాయి.
జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న ప్రభుత్వ టీచర్లు..
ఇటీవల పలువురి ఉపాధ్యాయుల తీరు చర్చనీయాంశంగా మారుతోంది. వారి ప్రవర్తనతో ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెస్తున్నారు. విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన వారు వక్రమార్గాన్ని అనుసరిస్తున్నారు. దేవాలయాలుగా భావించే పాఠశాలలు, కళాశాలల్లో అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారు. మరికొందరు క్షణికావేశంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. కొన్నిసార్లు విద్యార్థుల ముందే తన్నుకుంటున్నారు. ఇదే రీతిలో ప్రభుత్వ టీచర్లు జుట్లు పట్టుకుని పొట్టుపొట్టు కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. మధ్యప్రదేశ్ – ఖర్గోన్ లోని ప్రభుత్వ ఏకలవ్య పాఠశాలలో జుట్లు పట్టుకుని ఒకరినొకరు చెంపదెబ్బలు కొట్టుకున్నారు పాఠశాల ప్రిన్సిపాల్ ప్రవీణ దహియా, లైబ్రేరియన్ మధురాణి. ఇద్దరి మధ్య కొన్ని రోజులుగా వర్క్ విషయంలో విభేదాలు రావడంతో గొడవ పడ్డారని సమాచారం. మాటా మాటా పెరగడంతో విచక్షణ కోల్పోయి ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న కొందరు వారిని ఆపేందుకు ప్రయత్నించారు. ఇక ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఇద్దరిని ఉద్యోగాల నుంచి తొలగించి, తాత్కాలికంగా అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేశారు కమిషనర్. సమాజంలో ఉపాధ్యాయుల పట్ల ఉన్న గౌరవం ఇలాంటి చేష్టల వల్ల దిగజారుతోందంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరెస్టు.. రూ. 1500 కోట్లు కాజేసిన వైనం!
మనీలాండరింగ్ కేసుకు సంబంధించి హర్యానా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ధరమ్ సింగ్ చోకర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. దీన్ దయాళ్ ఆవాస్ యోజన పథకం కింద దాదాపు రూ.1,500 కోట్లను అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, సికందర్ సింగ్, అతని తండ్రితో కలిసి, 1,500 మందికి పైగా గృహ కొనుగోలుదారులను మోసం చేసి, ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో కలిసి నకిలీ నిర్మాణ ఖర్చులను చూపించి రూ. 400 కోట్లు స్వాహా చేశారని ఈడీ గుర్తించింది. అయితే, గత ఏడాది మార్చిలోనే అతడ్ని అరెస్ట్ చేయగా.. దీనిపై న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది. కాగా, మార్చి 2024లో, సికందర్‌ను ఈడీ అరెస్టు చేసింది. కానీ, పంజాబ్- హర్యానా హైకోర్టులో అతడు వేసిన బెయిల్ పిటిషన్ తిరస్కరించిన తర్వాత.. జైలు శిక్షను తప్పించుకోవడానికి అనారోగ్యంతో ఉన్నట్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీంతో అతడికి చికిత్స పూర్తయ్యే వరకు అరెస్ట్ చేయొద్దని తెలిపింది. కాగా, రోహ్‌తక్‌లోని ఒక ఆసుపత్రి వెలుపల స్వేచ్ఛగా తిరుగుతూ కనిపించాడు. ఈ విషయాన్ని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అతడ్ని అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు పాకిస్తాన్‌లో సైనిక శిక్షణ
మినీ స్విట్జర్లాండ్”గా పిలువబడే బైసారన్ లోయలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఒక నేపాలీ జాతీయుడితో సహా ఇరవై ఆరు మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన టెర్రరిస్టులను పట్టుకునేందుకు భారత భద్రతా దళాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఈ ఘోరమైన కాల్పులకు పాల్పిన ఉగ్రవాదులు పాకిస్తాన్‌లో ఉన్నత సైనిక శిక్షణ పొందారని నిఘా వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ నుంచి ఈ శిక్షణ వారు జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని పేర్కొనింది. ఇప్పటికే జైలులో ఉన్న కొంతమంది ఉగ్రవాదులను విచారించినప్పుడు ఈ సమాచారాన్ని బయట పెట్టారని అధికారులు తెలిపారు. కాగా, పహల్గామ్ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులలో ఒకరైన హషీమ్ ముసా గతంలో పాకిస్తాన్ స్పెషల్ సర్వీస్ గ్రూప్‌లో పారా-కమాండోగా పని చేశాడు. తరువాత అతను లష్కరే తోయిబాలో చేరాడు. ఇక, అప్పటి నుంచి అనేక ఉగ్రవాద దాడులకు పాల్పడుతున్నాడు. అయితే, 2023లో భారతదేశంలోకి ప్రవేశించినట్లు తెలిసింది.. అప్పటి నుంచి అతను జమ్మూ కాశ్మీర్ అంతటా జరిగిన ఆరు ఉగ్రవాద దాడుల్లో పాల్గొన్నట్లు తేలింది. గత ఏడాది అక్టోబర్లో గండేర్బల్ జిల్లాలో జరిగిన దాడిలో ఏడుగురు, బారాముల్లాలో జరిగిన దాడిలో నలుగురు భద్రతా సిబ్బంది మరణించారు.
గర్జిస్తున్న బంగారం ధరలు.. నేడు తులంపై ఎంత పెరిగిందంటే?
బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఓరోజు తగ్గుతూ మళ్లీ పెరుగుతూ కొనుగోలుదారులకు షాకిస్తున్నాయి. ఇవాళ మళ్లీ బంగారం ధరలు పెరిగాయి. నేడు తులం గోల్డ్ పై రూ. 220 పెరిగింది. పసిడి ధరలు పెరగగా వెండి ధరలు మాత్రం దిగొచ్చాయి. కిలో వెండిపై రూ. 1000 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,573, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,775 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 200 తగ్గడంతో రూ. 87,750 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 220 తగ్గడంతో రూ. 95,730 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87,900గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 95,880 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఆర్సీబీ గెలవకపోతే… నా భార్యకు విడాకులు ఇస్తా..!
ఐపీఎల్ లో అన్ని జట్ల పరిస్థితి ఒకలా ఉంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూటే సెపరేటు. తమ టీమ్ లో టాలెంటెడ్ ప్లేయర్లకు కొదవ లేకున్నా..ఆ జట్టు తలరాత మాత్రం మారట్లేదు. క్రిస్ గేల్, ఎబి డివిలియర్స్ లాంటి విధ్వంసకర బ్యాటర్లే జట్టును ఛాంపియన్ గా నిలబెట్టలేకపోయారన్న విమర్శలు ఎదురయ్యాయి. ప్రతి ఏడాది ఈ సాల కప్ నమదే అంటూ సందడి చేయడం… మిడ్ సీజన్లోనే చేతులెత్తేయడం అలవాటైపోయింది. అయితే ఈ సీజన్ లో ఆర్సీబీకి అన్నివిధాలుగా కలిసొచ్చింది. బలమైన ప్రత్యర్థి జట్లను దాటుకుంటూ వరుస విజయాలతో దూసుకెళ్తుంది. మరోవైపు కావాల్సిన రన్ రేట్ ని మైంటైన్ చేస్తుంది. ప్రస్తుతం ఆర్సీబీ ఖాతాలో 16 పాయింట్లున్నాయి. అంటే అఫీషియల్ గా ప్లేఆప్స్ బెర్త్ కన్ఫర్మ్ అయినట్టే. దీంతో అభుమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. ఎప్పుడెప్పుడు కోహ్లీ టైటిల్ లిఫ్ట్ చేస్తాడా అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సారి కూడా కప్ కొట్టకపోతే నా భార్యకు విడాకులిస్తానని ఓ ఫ్యాన్ ఇచ్చిన స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. మీరు మీ భార్యకు విడాకులు ఇచ్చేందుకు రెడీగా ఉండండని ఒకరు పోస్ట్ పెడితే.. మరో నెటిజన్.. తన భార్య ఆర్సీబీ టైటిల్ కొట్టొద్దని దేవుడ్ని మొక్కుకుంటుందని సెటైరికల్ కామెంట్ చేశాడు. ఏదేమైనా ఆర్సీబీ ఐపీఎల్ ఛాంపియన్ గా నిలవాలని కోట్లాది మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం జట్టు బ్యాటింగ్‌తో పాటు, బౌలింగ్ విభాగంలోనూ సత్తా చాటుతుంది. చూడాలి మరి చివరకు ఎం జరుగుతుందో..
శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్…
పుష్ప -2 రిలీజ్ రోజు న సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో శ్రీతేజ్ గాయపడిన సంగతి తెలిసిందే. చాలా నెలలుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శ్రీతేజ్ కొద్దీ రోజుల క్రితం ఆసుపత్రి నుండి డిశార్చి అయ్యాడు. అయితే శ్రీతేజ్ పూర్తిగా కోలుకునేందుకు మరి కొన్ని నెలలు పడుతుందని డాక్టర్స్ వెల్లడించారు. అదే సమయంలో శ్రీతేజ్ ను రీహాబిలిటేషన్ సెంటర్ కు తరలించారు. నేడు శ్రీతేజ్ ను పరామర్శించారు అల్లు అరవింద్. రీహాబ్ కు వెళ్లి డాక్టర్లను కలిసి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు అరవింద్. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘శ్రీ తేజ్ కోలుకోవటం కోసం మా కుటుంబం అంతా ఎదురుచూస్తోంది. శ్రీతేజ్ రోజురోజుకు కోలుకుంటున్న విషయం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. శ్రీ తేజ్ చికిత్సకు సహకరిస్తున్నారు అని చెప్పారు డాక్టర్లు. ఇప్పటికే రూ. 2 కోట్లు శ్రీతేజ్ అకౌంట్ లో డిపాజిట్ చేసాడు అల్లు అర్జున్. త్వరలోనే శ్రీ తేజ్ మనందరి మధ్య సాధారణల పిల్లల్లా ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను’ అని అన్నారు.
సినిమాలు లేక రిటైర్మెంట్ దశకు చేరుకున్న’రకుల్’
గ్లామర్‌తో టాలీవుడ్‌ను బుట్టలో పడేసి స్టార్స్ అందరినీ తనవైపు తప్పుకుంది రకుల్. కెరీర్‌లో ఒకట్రెండు హిట్స్ కొట్టి అరడజను ఛాన్సులు వేనకేసుకుని లక్కీ హీరోయిన్ అనిపించుకుంది. ఆ అదృష్టం మొహం చాటేయడంతో అసలుకే ఎసరొచ్చింది. కళకళలాడిన కెరీర్ మసకబారుతోంది. ఒకటా రెండా వరసగా ఫ్లాపుల మీద ఫ్లాపులు. తెలుగు, తమిళంలో ఏ సినిమా చేసినా నిరాశే. రారండోయ్ వేడుకచూద్దాం తర్వాత ఎన్నో సినిమాలు చేసినా తెలుగులో సక్సెస్ దక్కలేదు. ముఖ్యంగా మన్మథుడు2లో ఈ అమ్మడు పోషించిన క్యారెక్టర్ విమర్శలు తీసుకొచ్చింది. స్మోక్ చేసి కెరీర్‌కు పొగ పెట్టుకుంది రకుల్. హిందీలో ‘దే దే ప్యార్ దే’తో హిట్ కొట్టి బాలీవుడ్ ఆఫర్స్‌ను వెనకేసుకుందన్న పేరేగానీ రకుల్‌కు మరో హిట్ పడలేదు. హిందీలో నటించిన సినిమాలన్నీ ఫ్లాపే కావడంతో అక్కడ కూడా ఛాన్సులు తగ్గాయి. హిందీలో నటించిన లాస్ట్ మూవీ ‘మేరే హస్పెండ్ కీ బివి’ ఫ్లాప్ అయింది. కంటిన్యూస్ ప్లాపులు ఆఫర్స్ లేకపోయినా ఎప్పుడూ జనాలకు టచ్‌లో వుంటూనే వుంది రకుల్. చేతిలో సినిమాల్లేక కావాల్సినంత ఖాళీ దొరికింది. గ్లామర్‌గా ఫోజులివ్వడం లేదంటే ఫిట్‌నెస్ చాటున ఒయ్యారాలు ఒలకబోస్తూ కవ్వించాలని చూసినా తెలుగు హీరోల్లో ఒక్కరూ కనికరించి ఛాన్స్ ఇవ్వలేదు. తెలుగులో ఆఫర్స్ లేకపోయినా హిందీలో చివరిసారిగా ‘దేదే ప్యార్‌దే’ సీక్వెల్‌తో అదృష్టం పరీక్షించుకోనుంది రకుల్. మళ్లీ ఫామ్‌లోకి రావాలంటే ఈ క్రేజీ సీక్వెల్ సక్సెస్ చాలా అవసరం. భారతీయుడు3 చేతిలో వున్నా ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలీదు.
బాబిల్ ఖాన్ పోస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన టాలీవుడ్ డైరెక్టర్..
రీసెంట్ గా బాలీవుడ్ ఓ ఫేక్ ఇండస్ట్రీ పని చేయడానికి ఇది సరైన ప్లేస్ కాదు.. అంటూ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తనయుడు, బాబిల్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఎంత చర్చ జరుగుతోందో తెలిసిందే. ఈ వీడియో పెట్టిన కొద్ది నిమిషాల్లోనే బాబిల్ దీన్ని డిలీట్ చేశారు. అప్పటికే ఇది వైరల్‌గా మారడంతో చర్చ మొదలైంది. ఇక బాలీవుడ్ తీరును ఎండగడుతూ బాబిల్ చేసిన వీడియో వైరల్ గా మారడంతో అతని టీమ్ క్లారిటీ ఇచ్చింది ‘బాబిల్ ఆవేదనను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు’ అని పేర్కొంది. అయితే తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ డైరెక్టర్ సాయి రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ కంటికి మేము ఏమైనా పిచ్చోళ్లా కనిపిస్తున్నామా. మీరు ఏం చెప్పినా ఏం మాట్లాడకుండా కూర్చుంటామని అనుకుంటున్నారా? వీడియో లో అతడు ప్రస్తావించిన వారు మాత్రమే మంచి వాళ్ళు అయితే.. ఇంతకాలం అతనికి సపోర్ట్ నిలిచిన మేమంతా పిచ్చివాళ్లమా? ఒక గంట ముందు వరకూ అతడికి సపోర్ట్‌గా నిలవాలని అనుకున్నా. కానీ, మీ తీరు చూశాక ఇక్కడితో ఆగిపోవడం మంచిదనిపిస్తోంది. ఈ సానుభూతి ఆటలు ఇకపై పనిచేయవు మీరు నిజాయతీతో క్షమాపణలు చెప్పి తీరాల్సిందే’ అని సాయి రాజేష్ పోస్ట్ లో రాసుకొచ్చారు. ఇంతలోనే దీనిపై బాబిల్ ఖాన్ స్పందిస్తూ.. ‘ మీరు నా హృదయాన్ని ముక్కలు చేశారు. మీకోసం నేను ఎంతో శ్రమించా మీ సినిమాలోని పాత్రకు న్యాయం చేయడానికి రెండేళ్లపాటు కష్టపడ్డా ఎన్నో అవకాశాలు వచ్చినా అన్నింటినీ వదులుకున్నా’ అని రాసుకొచ్చాడు. వీరిద్దరి పోస్టులు నెట్టింట వైరల్ గా మారాయి. కానీ వీరిద్దరూ మళ్ళి వారి పోస్టులు డిలీట్ చేశారు. అయినప్పటికీ వీరిద్దరి మాటలు వైరల్ అవుతున్నాయి.