
అంతన్నారు, ఇంతన్నారు.. కాటేరమ్మ కొడుకులని ఆకాశానికి ఎత్తేశారు.. ఆరెంజ్ అంటే ఓ రేంజిలో ఉంటదని డీజేలు పెట్టారు, జేజేలు కొట్టారు. అన్నట్టే ఫస్ట్ మ్యాచే రాజస్థాన్ మీద రాయల్ విక్టరీ కొట్టారు. అంతే ఇగ ఖతం.. టాటా… గుడ్ బై!. పాయింట్ల పట్టికలో పైనున్న వాళ్లు ఠపీమని కిందపడిపోయారు, ఇంక లేవలేదు. ముక్కీ మూలిగీ మూడు మ్యాచ్‌లు గెలిచారు. ఐపీఎల్ 2025 ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుని, అస్సాం రైలెక్కారు.
కూకట్‌పల్లి క్లాసెన్ అన్నారు.. హయత్ నగర్ హెడ్ అన్నారు.. అంబర్ పేట్ అభిషేక్ శర్మ అన్నారు.. నితీష్ రెడ్డి ఉన్నాడు మాకేంటి అన్నారు.. మరి ఏమైంది బాస్. నిరుడి సిక్సర్లు ఏమైనాయి?, మునుపటి బౌండరీలు ఎక్కడపోయాయి?. పాయింట్ల పట్టిక మొదటి స్థానంలో ఉన్న సైన్యం అట్టడుక్కి ఎందుకు పడిపోయింది. పది మ్యాచులు ఎదురు చూసినా.. ప్లేఆఫ్‌కి చేరుకోలేకపోయారేం?. తురుంఖాన్లని చెప్పుకున్నారు కదా.. మరి ముష్టి మూడు మ్యాచులే గెలవడమేంటి స్వామీ!.
Also Read: KKR vs RR: బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్.. ప్లేఆఫ్స్ రేసులో నిలిచేనా?
అంటే.. అతి, అంతా అతి. పబ్లిక్ వాంట్స్ అతి. ఈ అతే కొంప ముంచింది. ఈ హైపే అస్సాంకు దారి తీసింది. ఈ బాకాలే పీకల్లోతు పూడ్చిపెట్టాయి. ఇషాన్ కిషన్ సెంచరీ కొట్టగానే కప్పు కొట్టినంత సంబరపడ్డారు. సిక్సర్ కొడితే బంతి ఉప్పల్ నుంచి నాగోల్ పోయిందని, అట్నుంచి అటే మూసీలో పడిందని కామెంటేటర్లు గొంతులు చించుకున్నారు. ఇక తర్వాత మ్యాచ్ నుంచి ఆరెంజ్ టీం ఏ రేంజిలో కూడా ఆడలేకపోయింది. అదే ముంబై ఇండియన్స్ లీగ్ ఆరంభంలో అట్టడుగున ఉంది, ఇప్పుడా టీం ఎక్కడికి పాకింది. ఆటన్నాక గెలుపు ఓటములు సహజం.. ఇదొక ఆత్మవంచన డైలాగ్. అంతేకానీ మనోళ్లు పోరాట పటిమ కనబరిచారు.. ఓడి గెలిచారు.. మనసులు గెలిచారు.. ఇలాంటి ఫీలింగ్ ఏదీ కలగలేదు సగటు హైదరాబాద్ ప్రేక్షకుడికి. పాపం కావ్య మారన్.. కెమెరాల నుంచి తప్పుకుంది. వీళ్ల పెర్ఫామెన్స్ చూసి అభిమాని కూడా లైట్ తీసుకున్నాడు. ఫైనల్‌గా హైదరాబాదీలు హర్టయ్యారు. కాటేరమ్మ కొడుకులు కాదు.. పోలేరమ్మ మనుమలు కాదు.. అంతా అస్సాం బ్యాచని ఆవేదన వ్యక్తం చేశారు. సన్ రైజర్స్ కాలేదు.. సన్ సెట్ అయిందని బాధపడ్డారు. ఫైనల్‌గా ఈసారి సీజన్‌ని మరిచిపోవడానికి టైం పడుతుంది. బెటర్ లక్ నెక్స్ట్ సీజన్.