Top Headlines 5pm 04 05 2025

లోయలో పడిన ఆర్మీ వాహనం.. ముగ్గురు సైనికులు మృతి

జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారత ఆర్మీ వాహనం లోయలో పడిపోయింది. 700 అడుగుల లోతైన లోయలో ఆర్మీ కాన్వాయ్ లోని వాహనం పడింది. జమ్ము నుంచి శ్రీనగర్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు సైనికులు మృతిచెందారు. మరణించిన సైనికులను అమిత్ కుమార్, సుజీత్ కుమార్, మాన్ బహదూర్ గా గుర్తించినట్లు వార్తా సంస్థ పిటిఐ తెలిపింది. 700 అడుగుల లోతైన లోయలో వాహనం పడిపోవడంతో వాహనం నుజ్జు నుజ్జైంది. సైనికుల మృతదేహాలు, వారి వస్తువులు, కొన్ని కాగితాలు ప్రమాద స్థలంలో చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF), స్థానిక స్వచ్ఛంద సేవకులు సహాయక చర్యలను ప్రారంభించారు.

స్టూడెంట్ల జీవితాలతో కాంగ్రెస్ చెలగాటం.. హరీష్ రావు ఫైర్..

ఫీజు రీయంబర్స్ మెంట్ ఇవ్వకుండా స్టూడెంట్ల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని మాజీ మంత్రి హరీష్‌ రావు ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. డిగ్రీ స్టూడెంట్లకు ఇంకా ఫీజు రీయంబర్స్ మెంట్ ఇవ్వకుండా కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. బడా కాంట్రాక్టర్లకు వేలకోట్లు దోచిపెట్టారని.. కానీ స్టూడెంట్లకు మాత్రం ఫీజు రీయంబర్స్ మెంట్ ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. డిగ్రీ స్టూడెంట్లకు రూ.800 కోట్ల ఫీజు రీయంబర్స్ మెంట్ ఇవ్వకుండా 6 లక్షల మంది స్టూడెంట్ల జీవితాలను అగమ్య గోచరంగా మార్చేసిందన్నారు.

కాంగ్రెస్లో మరోసారి బయటపడ్డ విభేదాలు.. మంత్రి ముందే తన్నుకున్న నాయకులు

సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఇందిరమ్మ కమిటీల మధ్య విభేదాలు చెలరేగాయి. మంత్రి దామోదర రాజనర్సింహ ముందే హస్తం పార్టీ నాయకులు గొడవకు దిగారు. ఇందిరమ్మ కమిటీల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అన్యాయం జరుగుతుందని జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఆగం చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు. వెంటనే కల్పించుకుని అలా ఏమీ ఉండదు.. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి న్యాయం చేస్తామని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చెప్పారు. ఇక, ఇందిరమ్మ కమిటీలో పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెత్తనం ఏంటని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. ఆయన బీఆర్ఎస్ నాయకులకే న్యాయం చేసి నిఖార్సైనా కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. దీంతో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి పటాన్ చెరు కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రంగ ప్రవేశం చేసిన పోలీసులు గొడవను సద్దుమణిగేలా చేశారు.

లేడీస్ హాస్టల్‌లో కెమెరాల కలకలం..

గుంటూరు బ్రాడీపేటలోని శ్రీనివాస లేడీస్ హాస్టల్‌లో సీసీ టీవీ కెమెరాల వ్యవహారం కలకలం రేపింది. హాస్టల్‌లోని బాత్రూం వద్ద సీసీ కెమెరాలు పెట్టారని విద్యార్థినులు అనుమానిస్తున్నారు. ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రాత్రి వేళల్లో హాస్టల్‌ కి బయట వ్యక్తులు వస్తున్నారని పేర్కొన్నారు. ఈ హాస్టల్ సురక్షితంగా లేదని తెలిపారు. ఈ ఘటనపై అరండల్‌పేట పోలీసులు విచారణ ప్రారంభించారు. హాస్టల్ యాజమాన్యాన్ని విచారిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీలో గొడవలు చూస్తుంటే బాధ అనిపిస్తుంది

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వివాదాలు, వర్గపోరు లాంటివి సహజమని, కానీ అవి పార్టీకి నష్టం కలిగించకూడదని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని అర్థం చేసుకోవాలంటే చాలాసేపు పడుతుందని, మన పార్టీ బలమే స్వేచ్ఛ, అదే బలహీనత కూడా అని ఆయన వ్యాఖ్యానించారు. నారాయణఖేడ్‌లో సంభవించిన గందరగోళ పరిస్థితులపై స్పందించిన దామోదర్ రాజనర్సింహ, అక్కడ ఎంపీ సురేష్, ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ఉన్నా కూడా వివాదం చోటు చేసుకోవడం బాధ కలిగించిందని అన్నారు. ఇలాంటి గొడవలపై బాధ్యత తీసుకోవాల్సిన అవసరం మాకు ఉందని, మిగతా ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థతులు జరిగితే, వాటిని సద్దుమణిగేలా చూస్తామని ఆయన తెలిపారు.

“మోడీ ఏమైనా నా అత్త కొడుకా.? యుద్ధం వస్తే నేను ఇంగ్లాండ్ పారిపోతా”: పాక్ ఎంపీ..

పహల్గామ్ ఉగ్రవాద ఘటనలో 26 మంది ప్రజలు చనిపోవడంతో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాకిస్తాన్ ‌కి చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్లు స్పష్టమైంది. ఈ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్‌పై ప్రతీకారం కోసం చూస్తోంది. ఇప్పటికే, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థని దెబ్బకొట్టేందుకు అనేక నిర్ణయాలు తీసుకుంది. కీలకమైన సింధు జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేసింది. అయితే, పాక్ నేతలు మాత్రం ‘‘యుద్ధ భాష’’ మాట్లాడుతూ, భారత్‌ని హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నారు.

SLBC ప్రాజెక్ట్‌పై మంత్రి ఉత్తమ్‌ కీలక ప్రకటన

తెలంగాణలో యాసంగి పంట సేకరణకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ దేశంలో అత్యధిక వరి సాగు జరిగే రాష్ట్రంగా నిలిచిందని తెలిపారు. ఈ పంట సీజన్‌లో చివరి గింజ కొనుగోలు అయ్యే వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని చెప్పిన ఉత్తమ్, రాష్ట్రంలోని 84 శాతం మందికి సన్న బియ్యం అందించేందుకు ప్రభుత్వం ఏటా రూ.14,000 కోట్ల మేర ఖర్చు చేస్తోందని వెల్లడించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు పెంచడం కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని స్పష్టం చేశారు.

రాహుల్ గాంధీని హిందూ మతం నుంచి బహిష్కరిస్తున్నాం..

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తాజాగా శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో జ్యోతిర్మఠానికి చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి పెద్ద ప్రకటన చేశారు. రాహుల్ గాంధీ ఇకపై హిందూ మతంలో భాగం కాదని ఆయన అన్నారు. అతన్ని హిందూ మతం నుంచి బహిష్కరిస్తామని ప్రకటించారు. బద్రీనాథ్‌లోని శంకరాచార్య ఆశ్రమంలో స్వామి అవిముక్తేశ్వరానంద మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ నిత్యం హిందుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. మనుస్మృతికి సంబంధించి రాహుల్ గాంధీ పార్లమెంటులో చేసిన ప్రకటన సనాతన ధర్మ అనుచరులందరినీ బాధపెట్టిందన్నారు. అత్యాచార నిందితులను రక్షించే సూత్రం మనుస్మృతిలో ఉందని రాహుల్ గాంధీ పార్లమెంటులో చెప్పారని శంకరాచార్య గుర్తు చేశారు.

అమృత్‌సర్‌లో ఇద్దరు పాక్ గూఢచారులు అరెస్ట్..

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే, ఉద్రిక్తతల నడుమ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఇద్దరు పాకిస్తాన్ గూఢచారులు దొరికారు. ఆర్మీ కంటోన్మెంట్, వైమానిక స్థావరాల సున్నితమైన సమాచారం, ఫోటోలను లీక్ చేయడంలో వీరి పాత్రకు సంబంధించి పంజాబ్ పోలీసులు ఇద్దర్ని అరెస్ట్ చేసినట్లు ఆదివారం తెలిపారు. ఇద్దరు వ్యక్తుల్ని పాలక్ షేర్ మాసిహ్, సూరజ్ మాసిహ్‌గా గుర్తించారు. పంజాబ్ డీజీపీ తన ఎక్స్ ఖాతాలో..‘‘ ఇద్దరు నిందితులు అమృత్‌సర్ సెంట్రల్ జైలులో ఉన్న హర్ ప్రీత్ సింగ్, అలియాస్ పిట్టు మరియు అలియాస్ హ్యాపీ ద్వారా పాకిస్తాన్ నిఘా కార్యకర్తలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వారిని శనివారం అరెస్టు చేశాము. అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేయబడింది, దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తు ముమ్మరం అయ్యే కొద్దీ మరిన్ని కీలక విషయాలు వెల్లడవుతాయని భావిస్తున్నాము’’ అని అన్నారు.

అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షలు.. అప్రమత్తమైన ప్రభుత్వం

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని హోంమంత్రి తానేటి అనిత తక్షణమే స్పందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడి తాజా పరిస్థితిపై సమాచారం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేసి, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.

 

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by Ntvtelugu website. This website is not to be held responsible for any of the content displayed.