
గుజరాత్ టైటాన్స్ పేసర్, దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్ కగిసో రబాడ డోపింగ్‌లో దొరికిపోయాడు. డ్రగ్స్ (నిషేధిత ఉత్ప్రేరకం) వాడినందుకు గానూ క్రికెట్ దక్షిణాఫ్రికా అతడిపై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ విషయాన్ని రబాడ స్వయంగా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపాడు. వినోదం కోసం తీసుకున్న డ్రగ్స్ కారణంగా తాను నిషేధాన్ని ఎదుర్కొంటున్నా అని పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను ప్రొవిజనల్ సస్పెన్షన్‌లో ఉన్నానని, త్వరలోనే తిరిగి క్రికెట్ ఆడుతానని రబాడ చెప్పాడు.
కగిసో రబాడ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ ఆడిన తొలి రెండు మ్యాచుల్లో రబాడ ఆడాడు. ఇక ఏప్రిల్ 3న స్వదేశానికి వెళ్లిపోయాడు. వ్యక్తిగత కారణాలతో స్వదేశం వెళ్లాడని అప్పుడు గుజరాత్ యాజమాన్యం తెలిపింది. అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలిసింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ. 10.75 కోట్లకు గుజరాత్ అతడిని కొనుగోలు చేసింది. ఈ సీజన్లో రెండు మ్యాచ్‌లు ఆడి రెండు వికెట్లు పడగొట్టాడు. ఇటీవల జీటీ కెప్టెన్ గిల్ మాట్లాడుతూ.. మరో 10-12 రోజుల్లో రబాడ తిరిగి వస్తాడని తాము ఆశిస్తున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం అతడు భారత్‌కు తిరిగొచ్చాడని తెలుస్తోంది.
గత జనవరి-ఫిబ్రవరిలో జరిగిన దక్షిణాఫ్రికా టీ20 లీగ్ సందర్భంగా జరిపిన పరీక్షల్లో రబాడ డోపీగా తేలినట్లు తెలుస్తోంది. ప్రపంచ డోపింగ్ నిరోధక వ్యవస్థ (వాడా) నియమావళి ప్రకారం.. కగిసో రబాడకు కనీసం మూడు నెలల నుంచి నాలుగేళ్ల వరకు శిక్ష విధించొచ్చు. అయితే తాను ప్రదర్శన కోసం డ్రగ్స్ తీసుకోలేదని నిరూపిస్తే మాత్రం మూడు నెలల శిక్షతో బయటపడొచ్చు. దక్షిణాఫ్రికా డోపింగ్ నిరోధక సంస్థ చికిత్సకు అంగీకరిస్తే.. శిక్ష రెండు నెలలకు కూడా కుదించొచ్చు. ఐసీసీ చర్యలు తీసుకుంటే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో రాబడ ఆడడం అనుమానమే.