
Vajra Super Shot: ఇటీవల జరిగిన పహల్‌గామ్ ఉగ్రదాడి తర్వాత ఐపీఎల్ 2025 సీజన్‌లో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టంగా మారినట్లు తెలుస్తోంది. దీనికి కారణం గగనతలంలో భద్రత కోసం ‘వజ్ర సూపర్ షాట్’ అనే యాంటీ-డ్రోన్ వ్యవస్థను ఐపీఎల్ స్టేడియంల వద్ద ప్రవేశపెట్టడమే. ఐపీఎల్ 2025లో భద్రత పెంచడం కోసం బీసీసీఐ, భద్రతా బృందాలు అన్ని స్టేడియంలలో కట్టుదిట్టమైన తనిఖీలు, అధునాతన సాంకేతికతలను ఉపయోగిస్తున్నాయి. దీనితో క్రికెట్ అభిమానులు ఎలాంటి భయం అవసరం లేకుండా మ్యాచ్‌లను ఆస్వాదించేలా తగు చర్యలు తీసుకుంటున్నారు సంబంధిత అధికారులు. ఈ సరికొత్త సాంకేతికత ఇకపై అభిమానులకు, ఆటగాళ్లకు సురక్షితమైన వాతావరణాన్ని అందించనుంది.
ఇకపోతే, అసలు వజ్ర సూపర్ షాట్ అంటే ఏమిటి? దీనిని ఎందుకు ఉపయోగిస్తున్నారన్న విషయానికి వస్తే.. ఈ వజ్ర సూపర్ షాట్, చెన్నైకి చెందిన బిగ్ బ్యాంగ్ బూమ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (BBBS) అభివృద్ధి చేసిన ఓ అత్యాధునిక యాంటీ-డ్రోన్ వ్యవస్థ. దీని ద్వారా చుట్టూ నాలుగు కి.మీ.ల పరిధిలో అనధికార డ్రోన్‌ల కదలికలను గుర్తించి వాటి సమాచార వ్యవస్థను అడ్డుకునేలా దీనిని రూపొందించారు. ఇక ఈ వజ్ర సూపర్ షాట్ చాలా తేలికైన టెక్నాలజీ. కాబట్టి దీనిని సులభంగా తీసుక వెళ్లవచ్చు కాబట్టి, ఐపీఎల్ వంటి పెద్ద ఈవెంట్‌లకు ఇది బాగా సరిపోతుంది. ఇక ఈ కొత్త టెక్నాలజీ వ్యవస్థను మొదటిసారిగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఉపయోగించారు.
ఇక 5 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ లోని పహల్‌గామ్ వద్ద లష్కర్-ఎ-తొయిబాకు చెందిన ఉగ్రవాదులు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 26 మంది యాత్రికులను హత్య చేయడంతో.. ఈ దాడి నేపథ్యంలో భారత్ లో భద్రతా వ్యవస్థలపై ఆందోళనలను పెంచింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లకు పెద్ద సంఖ్యలో అభిమానులు, ఆటగాళ్లు హాజరవుతున్న నేపథ్యంలో స్టేడియంల వద్ద భద్రత కోసం అధికారులు ఈ సరికొత్త ‘వజ్ర సూపర్ షాట్’ను రంగంలోకి తీసుక వచ్చారు.